ఋణనుబంధం

తెలిసి తెలియక చేసే తప్పులు కూడా బంధాలు అవుతాయి..
ఇతరులతో పూర్వజన్మలో మనకు గల ఋణాను బంధాలు తీర్చుకోవడానికే ఈ జన్మలో భార్యగా, భర్తగా, సంతానంగా, తల్లిదండ్రులుగా, మిత్రులుగా, నౌకర్లుగా, ఆవులు, గేదెలు, కుక్కలు ఇలా ఏదో ఒక రకమైన సంబంధంతో మనకి తారస పడుతుంటారు. ఆ ఇచ్చిపుచ్చుకునే ఋణాలు తీరగానే దూరమవడమో,మరణించడమో జరుగుతుంది. ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకో గలిగితే మన జీవితకాలంలో మనకి ఏర్పడే సంబంధాల మీద మోజు కలుగదు.
ఇతర జీవులతో మన ఋణాలు ఎలా ఉంటాయి అంటే
— మనం పూర్వ జన్మలో ఒకరి నుంచి ఉచితంగా ధనం కానీ, వస్తువులు కానీ తీసుకున్నా, లేదా ఉచితంగా సేవ చేయించుకున్నా ఆ ఋణం తీర్చుకోవడానికి ఈ జన్మలో మన సంపాదనతో పోషించబడే భార్యగా, సంతానంగా, మనతో సేవ చేయించుకునే వారి గాను తారసపడతారు.
— ద్వేషం కూడా బంధమే. పూర్వజన్మలో మన మీదగల పగ తీర్చుకోవడానికి మనల్ని హింసించే యజమానిగా లేదా సంతానంగా ఈ జన్మలో మనకి వారు తారసపడవచ్చు.
— మనం చేసిన అపకారానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ జన్మలో శత్రువులుగానో, దాయాదులుగానో,ఏదో ఒక రకంగా మనకు అపకారం చేసే వారిగా ఎదురవుతారు.
— మనం చేసిన ఉపకారానికి బదులుగా ఉపకారం చేయడానికి ఈ జన్మలో మిత్రులుగానో, సహాయకులుగానో ఎదురవుతారు .
.
ఇలాంటివి మనము తెలిసి తెలియక చాలా చేస్తూ ఉంటాం. మనం ఇతరుల నుంచి మొహమాటం చేతనో, మర్యాదకో, కృతజ్ఞత గానో, గౌరవంతోనో లేదా మరే ఇతర కారణాల ద్వారానో ఉచితంగా స్వీకరించిన వన్నీ కర్మ బంధాలయి జనన మరణ చక్రంలో మనల్ని బంధిస్తాయి. కొత్త వాళ్ల నుంచి పెన్ను లాంటి వస్తువులను తీసుకోవడం, మన పెట్టె లాంటివి మోయించడం, పక్క వాళ్ళు షాప్ కి వెళ్తుంటే నాకు ఫలానాది తీసుకురా అని చెప్పడం, ఇలాంటివి అనేక సందర్భాల్లో ఇతరుల సేవలను ఉచితంగా తీసుకుంటాం. అవి కర్మ బంధాలవుతాయి అని తెలియక మన జీవితకాలంలో చేసేఇలాంటి వేలకొద్దీ కర్మబంధాలో చిక్కుకుపోతుంటాము.
ఆరడుగుల తాచుపాము విషం ఎంత ప్రమాదకరమో, అలాగే అంగుళం తాచుపాము విషం కూడా అంతే ప్రమాదకరం. అలాగే కర్మ ఎంత పెద్దదైనా, చిన్నదైనా దాని ఫలితం దానికి ఉండి తీరుతుంది తప్ప మాయం కాదు. కాబట్టి ఇప్పుడు ఆలోచిద్దాం ఈ కర్మబంధాల నుంచి ఎన్ని జన్మలెత్తినా మనం తప్పించుకో గలమా.!

Leave a comment

Design a site like this with WordPress.com
Get started