ఒక వ్యక్తి ఎప్పుడూ అలవాటుగా సాయంకాలం నడక కోసం ఒక అడవి పక్కగా నడుస్తూ ఉండేవాడు. ఒక సాయంత్రం, అడవిలోనికి నడుద్దామని నిశ్చయించుకున్నాడు . అతను ఒక రెండు మైళ్ళు నడిచిన తరువాత, సూర్యాస్తమవటం ప్రారంభమై వెలుగు తగ్గటం మొదలయింది, అంచేత, అడవి నుండి బయటపడటానికి తిరుగు ప్రయాణమయ్యాడు. కానీ అతనికి భీతావహంగా ఆవల పక్కకి జంతువుల గుంపు చేరింది. ఆ క్రూర మృగాలు అతన్ని తరమటం మొదలుపెట్టాయి, వాటి నుండి తప్పించుకోవటానికి అతను ఇంకా అడవి లోపలికి పరిగెత్తాడు. అలా పరిగెత్తుతూ ఉంటే ఎదురుగా ఒక మంత్రగత్తె చేతులు చాచి అతన్ని కౌగిలించుకోవటానికి నిలబడి కనిపించింది. ఆమె నుండి తప్పించుకోవటానికి తన దిశ మార్చి ఆ మృగాలకి, మంత్రగత్తె కీ కూడా లంబకోణ దిశగా పరిగెత్తాడు. అప్పటికే చీకటైపోయింది. సరిగ్గా కనపడక చెట్టు తీగలచే కప్పబడిఉన్న ఒక గొయ్యి మీదికి ఉరికాడు.
ఆ గొయ్యిలో తలక్రిందులుగా పడిపోయాడు, కానీ అతని కాళ్ళు ఆ తీగలలో చిక్కుకున్నాయి. దీనితో అతను గొయ్యిలో తలక్రిందులుగా వ్రేలాడుతున్నాడు. కొద్ది నిమిషాల తరువాత తేరుకుని చూస్తే ఆ గొయ్యి అడుగుభాగంలో ఒక పాము, వీడు పడిపోతే కాటేద్దామని వేచిఉంది. ఈ మధ్యలో రెండు ఎలుకలు కనిపించాయి – ఒకటి తెల్లది, ఇంకోటి నల్లది – ఇవి తీగ ఉన్న కొమ్మని కొరకటం ప్రారంభించాయి. ఇవి చాలదన్నట్లు, కొన్ని కందిరీగలు చేరి ముఖాన్ని కుట్టడం మొదలెట్టాయి. ఇటువంటి ప్రమాదకరమైన స్థితి లో అతను నవ్వుతూ కనపడ్డాడు. ఇలాంటి నికృష్ట స్థితిలో ఎలా నవ్వగలుగుతున్నాడు? అని విచారించటానికి తత్వవేత్తలు కూడారు. వారు పైకి చూస్తే ఒక తేనెతుట్టె కనిపించింది దాని నుండి తేనే బొట్లుబొట్లుగా కారి అతని నాలుకపై పడుతోంది. అతను ఆ తేనెను నాకుతూ, ఎంత బాగుందో అనుకుంటున్నాడు; అతను ఆ మృగాలని, మంత్రగత్తెని, పాముని, ఎలుకలని, కందిరీగలని మర్చిపోయాడు.
ఈ కథ లోని వ్యక్తి మనకు వెర్రివాడిలా కనిపించవచ్చు. కానీ, కోరికలకు వశమై ఉన్న అందరి మానవుల పరిస్థితిని ఈ వృత్తాంతం చూపిస్తుంది. ఆ వ్యక్తి వాహ్యాళికి వెళ్ళిన అడవి ఈ భౌతిక జగత్తు ని సూచిస్తుంది; ఇక్కడ ప్రతి అడుక్కీ ప్రమాదం పొంచి ఉంది. అతన్ని తరిమిన జంతువులు – మరణించే వరకూ బాధించే మనకొచ్చే వ్యాధులను సూచిస్తాయి. మంత్రగత్తె – కాల గమనంలో మనలను ఆలింగనం చేసుకోవటానికి వేచిఉన్న ముసలితనాన్ని సూచిస్తుంది. గొయ్యి అడుగున ఉన్న పాము – అనివార్యమైన మరణాన్ని సూచిస్తుంది. కొమ్మను కొరుకుతున్న తెల్ల, నల్ల ఎలుకలు – పగలు, రాత్రి ని సూచిస్తాయి, అవి నిరంతరం ఆయుష్షు ని గ్రసిస్తూ మరణానికి చేరువ చేస్తున్నాయి. ముఖాన్ని కుట్టే ఆ కందిరీగలు – మనస్సులో జనించి, దాన్ని ఉద్వేగానికి గురి చేసే అనంతమైన కోరికలు; ఇవి బాధను, దుఃఖాన్ని కలుగచేస్తాయి. తేనె – ప్రపంచంలో అనుభవించే ఇంద్రియ సుఖాలను సూచిస్తుంది; ఇది మన బుద్ది యొక్క విచక్షణని కమ్మివేస్తుంది. కాబట్టి మన ప్రమాదకరమైన పరిస్థితిని *మరిచిపోయి, క్షణభంగురమైన ఇంద్రియ సుఖాలని ఆస్వాదించటం లోనే *మునిగి పోతాము. ఇలాంటి కామపూరిత వాంఛలే మన విచక్షణా శక్తిని కప్పివేస్తాయి.*
ఈ యొక్క పూర్తి కప్పివేత అనేది తామసిక కోరికలు విచక్షణా శక్తిని నశింపచేయటంవలన కలిగే పరిణామం వంటిది. ఈ ప్రకారంగా మన కోరికల స్థాయిని బట్టి మనం విన్న, చదివిన ఆధ్యాత్మిక జ్ఞానంమరుగున పడి పోతుంది.
భగవద్గీత
🙏 కృష్ణం వందే జగద్గురుమ్ 🙏