మన ప్రాచీనులంత శుభ్రంగా మనం ఉన్నామా??
ప్రాచీన భారతీయ రుషులు పేర్కొన్న ఇరవై సద్గుణాల్లో, ‘శౌచం’ ఒకటి. దీనికి మన రుషులు చాలా ప్రాముఖ్యం ఇచ్చారు. శౌచం అంటే శుద్ధిగా ఉండటం. ఇది బాహ్యశుద్ధి. ఈ శుద్ది తర్వాత జరిగేది అంతఃకరణ శుద్ధి. రాగద్వేషాలు కానీ, కామక్రోధాలు కానీ లేని సాత్వికమైన దైవత్వం సిద్ధించాలంటే- ముందుగా బాహ్యశుద్ధి జరగాలంటారు పెద్దలు. అందుకే శుచి…శుభ్రత…ఆరోగ్యం….ఆధ్యాత్మిక సాధన కోసం మన రుషులు అనేక విలువైన జీవన మౌళిక సూత్రాలను…, హిందువుల దైనందిన జీవన విధానంలో ప్రవేశపెట్టారు. వీటి అర్థం, పరమార్థం, తెలియని పాశ్చాత్యులు, ఇంగ్లీష్ సెక్యులర్ మేధావులు, మార్క్స్ వాదులు, నాస్తికవాదులు ఇప్పటికి తప్పుడు ప్రచారం చేస్తునే ఉన్నారు.
‘పరిశుభ్రతలోనే పరమాత్ముడు ఉంటాడు’ అంటారు విజ్ఞులు. అలాగే స్వచ్ఛతలోనే స్వస్థత ఉంటుంది. అది మన శరీరానికే కాదు, మనసుకీ వర్తిస్తుంది. ఇదే హిందూ జీవన విధానం…! అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఇది రుషి వాచకం..! మన రుషులు చెప్పడమే కాదు….మానవుడి సంపూర్ణ ఆరోగ్య సాధన కోసం ఎన్నో పరిశోధనలు చేశారు. ఆ తెలుసుకున్న సత్యాలను మొదట తామే ఆచరించారు. ఆ తర్వాత గ్రంధాలు రచించారు. తమ శిష్యుల చేత ప్రచారం చేశారు. భారతీయ జీవన మూల సూత్రాల్లో చేర్చారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఆచరించేలా కట్టుబాటు చేశారు. మానవుడు ఆరోగ్యంగా జీవించాలంటే సాన్నం, భోజనం…అత్యంత ముఖ్యం…! వీటిని శాస్త్రీయంగా ఆచరించలేక నేడు ఆధునిక మానవుడు అనేక వ్యాధుల బారినడపడుతున్నాడు. ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ తాను సంపాదించిన సంపదనంతా డాక్టర్లకు…కార్పొరేట్ హాస్పిటల్స్ కు ఊడ్చిపెడుతున్నాడు.
పాశ్చాత్య కార్పొరేట్ సంస్థలు, తమ వస్తువుల అమ్మకాల కోసం మన దేశంలో అనేక తప్పుడు ప్రచారాలు చేశాయి. తప్పుడు పరిశోధనలు, నివేదికలతో ప్రజలను అయోమయానికి గురి చేశాయి. ఇప్పటికి కూడా చేస్తున్నాయి. ఈ మార్కెట్ మాయజాలంలో పడి సగటు భారతీయుడు ఏది సత్యమో, ఏది అసత్యమే తెలుసుకోలేక పోతుడున్నాడు. ప్రచార ఆర్భాటాలకు మోసపోతున్నాడు.
గతంలో అందరూ తలకు నూనే రాసుకొనేవారు. అయితే కొన్ని దశబ్దాలుగా తలకు నూనె పట్టించకూడదనే ఒక ప్రచారం జరుగుతూ వచ్చింది. తలకు నూనె రాచుకోవడవం అనాగరీకం అని భావించేలా సాగింది వీరి ప్రచారం. ఫలితంగా నేడు అనేకమంది భారతీయ యువతీయువకులు తలనొప్పి, వెంట్రుకలు ఊడిపోవుట, 20 ఏళ్లకే తెల్లవెంట్రుకలు రావడం మనం చూస్తున్నాం… అనుభవిస్తున్నాం కూడా.
ఇక అంతేకాదు భారతీయ భోజన విధానంపై అనేక అసత్యాలను ప్రచారం చేశారు. ఒకప్పుడు భారతీయలు భోజనంలో ఆవు నెయ్యి తప్పనిసరిగా వాడేవారు. అయితే ఒక పక్కా ప్లాన్ ప్రకారం మన దేశంలో ఆవు నెయ్యిపై విష ప్రచారమే చేశారు. ఆవు నెయ్యితో కొలెస్ట్రాల్ పెరుగుతుందని తప్పుడు ప్రచారం చేశారు. నిజానికి నేడు మనం వాడే అన్ని రకాల నూనెల కంటే, రిఫైండ్ ఆయిల్ లో కంటే కూడా ఆవు నెయ్యిలో కొలెస్ట్రాల్ ఉత్పత్తి చేసే గుణం తక్కువగా ఉంటుంది. ఆవు నెయ్యి బుద్ధిని పెంచుతుంది. జ్ఞాపకశక్తిని వృద్ధి చేస్తుంది. అంతేకాదు జీర్ణశక్తిని పెంచుతుంది. ఆవు నెయ్యిని వాడకపోవడంతో నేడు అనేక మంది జీర్ణశయ రోగాలతో బాధపడుతున్నారు.